
కారంపూడి పట్టణంలోని భవిత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని బాధరబోయిన నాగలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారి అకాల మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ విషాద సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మానవత్వాన్ని చాటుకుంటూ నాగలక్ష్మి కుటుంబానికి అండగా నిలిచారు. రెండు నెలలకు సరిపడా బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులను సమీకరించి అందజేశారు. ఈ సహాయాన్ని ఎంఈఓ-1 అనిల్ కుమార్, ఎంఈఓ-2 రవికుమార్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల (మెయిన్) ప్రధానోపాధ్యాయురాలు పుల్లమ్మ, ఉర్దూ ఉన్నత పాఠశాల హెచ్ఎం బిక్షమయ్య, భవిత పాఠశాల ఉపాధ్యాయురాలు మాధవి, ఉపాధ్యాయులు మల్లికార్జున, రాధాకృష్ణమూర్తి, మాన్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పలు పాఠశాలల సిబ్బంది కలిసి సరుకులను సమీకరించి అందించడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, కష్టకాలంలో ఉపాధ్యాయులు ముందుకు వచ్చి సహాయం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ధైర్యం కలగాలని వారు ఆకాంక్షించారు
