
దశాబ్ధాల కల సాకారానికి చారిత్రాత్మక అడుగుపడింది..!
వరికపూడిశెల ప్రాజెక్ట్ కు రూ.63.14 కోట్ల నిధులు ..!
హర్షం వ్యక్తం చేసిన ఎమ్మల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
మాచర్ల:
కూటమి ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయంతో ఏడు దశాబ్ధాల పల్నాడు ప్రజల కల సాకారానికి అడుగులు పడ్డాయని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రైతుకు ఇచ్చిన హామికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. రైతుల చిరకాల కోరికను కూటమి ప్రభుత్వం తీర్చిందన్నారు.వెల్దుర్తి,మాచర్ల,దుర్గి, కారంపూడి మండలాల్లో సాగునీటి పైపు లైన్ పనులు చేపట్టేందుకు అవసరమైన భూ సేరకణకు ప్రభుత్వం రూ. 63.14 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీతో మరో అడుగు పడిందని వెల్లడించారు. నిధులు మంజూరు చేయడమేకాకుండా.., యుద్దప్రాతిపదికన పనులు ప్రారంభించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు. అంతేకాక గతంలో ఫారెస్ట్ క్లియరెన్స్ కు రూ.14.81 కోట్లు నిధులను అటవీశాఖకు జమ చేసిందన్నారు. ఎగువ పల్నాడు దశాబ్ధాలుగా సాగు, తాగునీటి కోసం అల్లాడిపోతుంటే గత వైసీపీ ప్రభుత్వం తాత్సారం చేసిందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 20 సంవత్సరాలుగా వరికపూడిశెలపై పచ్చి అబద్దాలు ఆడుతూ ప్రజలకు తీరని ద్రోహం చేశాడని చెప్పుకొచ్చారు. వరికపూడిశెల నిర్మించకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాచర్ల మాజీ.. ఇంకా సిగ్గులేకుండా నీచ రాజకీయాలు చేయడం ఆయన చెల్తుతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రైతు పక్షపాత ప్రభుత్వంగా ముద్ర వేసుకుందన్నారు. పల్నాడులో రైతు కష్టాన్ని చూపి చలించిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు వరికపూడిశెల నిర్మించి తీరుతామని చెప్పారని గుర్తు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి కృషి చేస్తూ.., నిధులు కేటాయిస్తున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
