
మాచర్ల, పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాచర్ల పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మాచర్ల రింగ్‌రోడ్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్క్ సెంటర్‌లో నడిరోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. తర్వాత బస్టాండ్ సెంటర్‌లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతు భరోసా, అమ్మ ఒడి వంటి సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని, మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ కార్యక్రమాలకు అనవసర ఆంక్షలు విధిస్తున్నారని, మైక్ అనుమతి కూడా నిరాకరించడం బాధాకరమని అన్నారు. పోలీసులను అడ్డుపెట్టి “రెడ్‌బుక్ రాజ్యాంగం” అమలు చేస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు మరియు వేధింపులను పార్టీ శ్రేణులు డిజిటల్ రూపంలో నమోదు చేసుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
