
పల్నాడు జిల్లా, నూజండ్ల:
పల్నాడు జిల్లాలోని నూజండ్ల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో శుక్రవారం అపూర్వ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల బాత్రూమ్‌లో భారీ కొండచిలువ కనిపించడంతో విద్యార్థుల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.
వివరాల్లోకి వెళితే… ఒక విద్యార్థి టాయిలెట్‌కు వెళ్లేందుకు బాత్రూమ్ తలుపు తెరిచిన వెంటనే లోపల పెద్ద కొండచిలువను గమనించాడు. దీంతో అతను భయంతో కేకలు వేయగా, ఇతర విద్యార్థులు కూడా భయంతో పరుగులు తీశారు.
ఈ ఘటనతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఈ ఘటనతో కొంతసేపు పాఠశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, పాము పట్టుబడిన తర్వాత విద్యార్థులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, పాఠశాల పరిసరాల్లో అడవి జంతువులు ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు అధికారులను కోరుతున్నారు.
