
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మాజీ గవర్నర్, రాజకీయ భీష్ముడు కొణిజేటి రోశయ్య 93వ జయంతి సందర్భంగా మాచర్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాచర్లలోని రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూలై 4న రెండు తెలుగు రాష్ట్రాల్లో రోశయ్య జయంతిని ఎంతో గౌరవప్రదంగా నిర్వహించడం ఆనవాయితీగా మారిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దశాబ్దాల పాటు సమర్థంగా నడిపించిన అపూర్వ ఆర్థికవేత్తగా, రికార్డు స్థాయిలో 15 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకే దక్కిందన్నారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో కొణిజేటి రోశయ్య పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడిందని పేర్కొన్నారు. వివాదరహిత రాజకీయ నాయకుడిగా, సమయస్ఫూర్తి కలిగిన పరిపాలకుడిగా, క్లిష్ట ఆర్థిక పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్న మేధావిగా ఆయన విశేష గుర్తింపు పొందారని కొనియాడారు.
మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గాల్లో కీలక శాఖలను నిర్వహించి రాష్ట్ర అభివృద్ధికి విశేష సేవలందించారని తెలిపారు. వైఎస్ఆర్ ఆకస్మిక మరణానంతరం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి పరిపాలనను సమర్థవంతంగా ముందుకు నడిపించారని గుర్తు చేశారు.
రోశయ్య జయంతి నేటి ప్రజాప్రతినిధులు, యువతకు నిజాయితీ, పరిపాలనా నైపుణ్యం, ప్రజాసేవ పట్ల అంకితభావం వంటి విలువలను గుర్తు చేసే స్ఫూర్తిదాయక సందర్భంగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.

