
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 1886లో అమెరికాలోని చికాగోలో కార్మికులు 8 గంటల పనిదినం కోసం చేసిన పోరాటం, త్యాగాల జ్ఞాపకార్థం మే 1ను కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. హేమార్కెట్ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల త్యాగాలను ప్రపంచం స్మరించుకుంటోందన్నారు. శ్రమజీవుల ఐక్యత, సామాజిక న్యాయం ఈ దినోత్సవానికి ప్రతీకలని పేర్కొన్నారు.
కార్మికుల కష్టాన్ని గౌరవించడం, వారి హక్కుల కోసం పోరాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కార్మిక సోదర సోదరీమణులకు ఈ రోజు ఒక పండుగలాంటిదని, వారి శ్రమను గౌరవించే రోజు ఇదని చెప్పారు.
ఈ సందర్భంగా వరికెపూడి శెల ప్రాజెక్టుపై ఆయన స్పందిస్తూ, ప్రాజెక్టు సాధన కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు పోలీసులు మొదట అనుమతి ఇచ్చి, తరువాత రాజకీయ ఒత్తిళ్లకు లోనై నిరాకరించడం సరికాదని విమర్శించారు. పది మండలాలకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టును అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రస్తావిస్తున్నాయని, కానీ ఆచరణలో పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి వరికెపూడి శెల ప్రాజెక్టును ప్రారంభించి మొదటి దశ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
