
మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి పై బీరుసీసాలతో దాడి యత్నం.. ఒకరు అదుపులో, ముగ్గురు పరార్
రెంటచింతల మండలం పశర్లపాడు గ్రామంలో జరిగిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ల సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై బీరుసీసాలతో దాడి యత్నం జరిగింది.
ఎమ్మెల్యే కాన్వాయ్ గ్రామంలోకి ప్రవేశిస్తున్న సమయంలో సచివాలయం వద్ద మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఆయన కారుపై బీరుసీసాలు విసిరినట్లు సమాచారం. అయితే సీసాలు ఎస్కార్ట్ వాహనంపై పడటంతో ప్రమాదం తప్పింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై వాహన శ్రేణిని నిలిపివేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనలో ఎస్కే సైదా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారైనట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న గురజాల డీఎస్పీ ఎం.మహేశ్వరరావు హుటాహుటిన గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
తర్వాత మాజీ సర్పంచ్ గోళ్ల వెంకటనారాయణ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “నేను పల్నాడు బిడ్డనే.. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. ప్రశాంతంగా జరుగుతున్న తిరునాళ్లను భగ్నం చేయడానికే ఇలాంటి దుశ్చర్యలు చేశారు” అని అన్నారు.
అలాగే గత వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలని, మంచితనాన్ని చేతగానితనంగా భావించొద్దని హెచ్చరించారు.
