
గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ట్రినిటీ యూనో ట్రేడర్స్ అల్యూమినియం కంపెనీలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి మృతికి దారితీసింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్, ధీరజ్ పరుస్తా అనే ఇద్దరు కార్మికులు మద్యం మత్తులో రాత్రి 11 గంటల సమయంలో గొడవకు దిగినట్లు సమాచారం. చిన్న వివాదంగా ప్రారంభమైన తగువు క్రమంగా తీవ్రరూపం దాల్చి, ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది.
ఈ క్రమంలో కంపెనీలోని గ్లాస్ డోర్ పగలగొట్టబడగా, ధీరజ్‌కు చేతికి తీవ్ర గాయం అయినట్లు తెలుస్తోంది. గాయంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆయన అక్కడికక్కడే కుప్పకూలినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు, ఇది పరస్పర దాడి ఫలితంగానే జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి సమయంలో ఇద్దరూ గొడవపడుతున్నారని స్థానికులు చెబుతుండగా, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
