
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో బెల్టు దుకాణాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. మండలంలో అక్రమంగా బెల్టు షాపులు ఏరులై పారుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం కండ్రిక గ్రామానికి బెల్టు షాపుల కోసం మద్యం తరలిస్తున్న ఓ వాహనాన్ని గ్రామ మహిళలు అడ్డుకున్నారు. తమ గ్రామానికి మద్యం సరఫరా చేయవద్దని హెచ్చరిస్తూ ఆటోలో ఉన్న మద్యం సీసాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు.
గ్రామాల్లో మద్యం విక్రయాల వల్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి బెల్టు దుకాణాలను పూర్తిగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
