
బాపట్ల జిల్లాలో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి, భారీ మొత్తంలో నగదు, బంగారు, వెండి ఆభరణాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు.
మంగళవారం బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా బూటియా గ్రామానికి చెందిన భురు మక్వానా, రమేష్ మాచర్, సంతోష్ భూరియా అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
వీరు బిల్లు తెగకు చెందిన వారని, దొంగతనాలను వృత్తిగా ఎంచుకుని జీవనం సాగిస్తున్నారని ఎస్పీ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో వీరిపై అనేక దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు.
బాపట్ల, చీరాల, గూడూరు, గుంటూరు ప్రాంతాల్లో వీరిపై మొత్తం 18 కేసులు నమోదయ్యాయని, వాటికి సంబంధించి రికవరీ చేపట్టినట్లు పేర్కొన్నారు.
నిందితుల వద్ద నుంచి రూ.5 లక్షల నగదు, రూ.21.90 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, 4 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
