
మాచర్ల మండలం: పల్నాడు ప్రాంత అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తాళ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఐఆర్పీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్, ఇండియా ఎన్స్యూర్, అసిస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రూ.24 లక్షల వ్యయంతో నిర్మించిన డైనింగ్ హాల్‌ను ఎంపీ లావు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ లావు మాట్లాడుతూ, వెనుకబడిన పల్నాడు అభివృద్ధికి ఈ ప్రాంతంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగిన వారు దాతలుగా మారి తమ మాతృభూమి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్యం, తాగు మరియు సాగునీటి రంగాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మాచర్ల నియోజకవర్గానికి మౌళిక వసతులు, రోడ్లు, తాగు–సాగునీరు, యువతకు ఉపాధి వంటి అంశాల్లో రానున్న మూడేళ్లలో సమగ్ర అభివృద్ధి సాధిస్తామని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న కార్యక్రమాలు పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. సామాజిక సేవలో భాగస్వామ్యం వహిస్తున్న అసిస్ట్ సంస్థ సేవలను ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, పల్నాడు అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, ఎంపీ లావు నాయకత్వంలో మాచర్ల అభివృద్ధి దిశగా పలు భారీ ప్రాజెక్టులు అమలు అవుతున్నాయని తెలిపారు. టెక్స్టైల్ పార్క్, జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటి ప్రాజెక్టులు, నాగార్జునసాగర్ పర్యాటక అభివృద్ధి, కేంద్రీయ విద్యాలయం, బైపాస్ రోడ్లు వంటి పథకాలు ప్రాంత అభివృద్ధికి దోహదపడుతున్నాయని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనలో అసిస్ట్ సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కిరణ్ కుమార్, రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధారూ నాయక్, సంస్థ ప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
