
మాచర్ల: పట్టణంలోని వైభవ్ రెసిడెన్సి అండ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు సుమారు రూ.75 వేల విలువైన ఏడు ట్రైసైకిళ్లను రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ ఎస్.వి. రాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు.
దుర్గి మండలంలోని ముటుకూరు సమీప కొండ ప్రాంతంలో ఉన్న నెహ్రూ తండా ప్రజల సమస్యలను గుర్తించిన రోటరీ క్లబ్, వారికి శుద్ధమైన తాగునీరు అందించేందుకు సుమారు రూ.2 లక్షల విలువైన ఆర్ఓ ప్లాంట్ను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ను జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు పంగులూరి కళ్యాణ్ సహకారంతో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ సీనియర్ రొటేరియన్ ఝాన్సీ ప్రేమానంద్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి తన ఆదాయంలో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగించాలని సూచించారు. రోటరీ క్లబ్బుల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.
తాళ్లపల్లి పవర్ గ్రిడ్ మేనేజర్ దివాకర్ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల చేపడుతున్న సేవా కార్యక్రమాలకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ జుజ్జురి మురళి, డిసీజ్ ప్రివెన్షన్ చైర్మన్ డా. కొండవీటి రామకోటయ్య, కార్యదర్శి ఆలేటి కోటేశ్వరరావు, కన్వీనర్ పఠాన్ నాగూర్ వలి, మాజి అధ్యక్షులు, సభ్యులు, వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు షేక్ అన్వర్ భాష తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన దివ్యాంగులు రోటరీ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
