
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మాచర్ల పట్టణంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాచర్ల అన్న క్యాంటిన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రజలకు ఉచిత భోజన వసతి కల్పించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తెలిపారు.
జన్మదినోత్సవాన్ని సేవా దినోత్సవంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం మూడు పూటలుగా ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. పట్టణ ప్రజలు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
అన్న క్యాంటిన్‌లో పరిశుభ్రత, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ భోజన పదార్థాలను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా పంపిణీ జరగేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఉపశమనం కలగడమే కాకుండా, సామాజిక సేవా స్పూర్తి మరింత బలపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
