
పల్నాడు జిల్లా కారంపూడి శివారులోని పేటసన్నిగండ్ల గ్రామ సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
వివరాల ప్రకారం… కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామానికి చెందిన కోళ్ల ఫారం యజమాని బొలెరో మాక్స్ వాహనం అతివేగంతో నరసరావుపేట నుంచి కారంపూడి వైపు వస్తుండగా, పిడుగురాళ్ల గాంధీనగర్‌కు చెందిన మేకల శివాజీ, చెవుల యేసుదాసు మరో వ్యక్తితో కలిసి బైక్‌పై అడిగోప్పల శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్లి తిరిగి పిడుగురాళ్ల వైపు వెళ్తున్నారు.
ఈ క్రమంలో అతివేగంగా వచ్చిన బొలెరో మాక్స్ బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో శివాజీ, యేసుదాసు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ప్రథమ చికిత్స కోసం నరసరావుపేటకు తరలించారు.
అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో మూడు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణమైన బొలెరో మాక్స్ డ్రైవర్ పరారైనట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
