
పల్నాడు జిల్లాలో ప్రతి గడపకు తాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఆదివారం మాచర్ల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలిసి ఎస్కేబీఆర్ కళాశాల క్రీడా మైదానం పక్కన రూ.25 కోట్లతో నిర్మిస్తున్న కేంద్రీయ విద్యాలయ స్థలాన్ని పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించిన ప్లానింగ్ మ్యాప్‌ను పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ లావు, మొదటి దశలో రూ.1200 కోట్ల వ్యయంతో సాగర్ శుద్ధ జలాలను మాచర్ల, గురజాల నియోజకవర్గాలకు అందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక మిగతా ఐదు నియోజకవర్గాలకు జల్ జీవన్ మిషన్ నిధుల ద్వారా తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత గల మూడు ప్రాజెక్టుల్లో వరికపూడిశెల ఒకటని, త్వరితగతిన అనుమతులు తీసుకుని పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

అలాగే 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలికంగా స్థానిక బాయ్స్ హై స్కూల్లో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించి, అనంతరం శాశ్వత భవనాల్లో తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎంపీ లావు నాయకత్వంలో వచ్చే మూడేళ్లలో వరికపూడిశెల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అవసరమైన అనుమతుల కోసం ఇప్పటికే కేంద్రంలో చర్యలు కొనసాగుతున్నాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. 4.56 ఎకరాల్లో కేంద్రీయ విద్యాలయ నిర్మాణం జరుగుతుందని, విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయకత్వంలో విద్యా రంగానికి ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు. ఈ విద్యాలయం ద్వారా మాచర్ల విద్యార్థుల భవిష్యత్తు మరింత మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కిరణ్ కుమార్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
