
ఇనుమెళ్లలో పురాతన దేవాలయంలో 7 విగ్రహాలు వెలికితీత
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం ఇనుమెళ్ల గ్రామంలో సంచలన ఘటన వెలుగుచూసింది. పురాతన శ్రీ భావనారాయణ స్వామి దేవాలయంలో ఏడు విగ్రహాలు బయటపడటం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.
ఆలయ పునర్నిర్మాణ పనుల భాగంగా మంగళవారం రాత్రి విగ్రహాలను తొలగించే సమయంలో దేవాలయం లోపల ఒక బావి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం రాళ్లను తొలగించగా, బావిలో నుంచి ఏడు లోహ విగ్రహాలు బయటపడ్డాయి.
ఈ ప్రక్రియను దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారుల సమక్షంలో నిర్వహించారు. వెలికితీసిన విగ్రహాలు విలువైన పంచలోహ విగ్రహాలు అయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
పూర్వ కాలంలో దొంగల బెడద నుంచి రక్షణ కోసం ఈ బావిలో విగ్రహాలను దాచినట్లు స్థానికులు చెబుతున్నారు. అదనంగా, ఆలయంలో మరోచోట మూడు రేకులు కూడా గుర్తించినట్లు సమాచారం.
ఇనుమెళ్ల గ్రామం స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్వగ్రామం కావడం గమనార్హం. దేవాలయంలో లభించిన విగ్రహాలను బుధవారం ఆయన పరిశీలించనున్నారు.
