
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దాఖలైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.
వేసవి సెలవుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియ పూర్తయిందని ఆయన తెలిపారు.
బీసీల సామాజిక స్థితిగతులపై జరుగుతున్న సర్వే పూర్తి కావడానికి మరో నెల రోజులు పట్టవచ్చని కోర్టుకు తెలియజేశారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది ఈ సర్వేను నిర్వహిస్తున్నట్లు వివరించారు.
సర్వే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏకసభ్య కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని ఏజీ పేర్కొన్నారు.
ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. తదుపరి విచారణను జూలై మొదటి వారానికి వాయిదా వేసింది. అప్పటికి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
