
జూలకంటి వ్యాఖ్యలకు పిన్నెల్లి ఘాటు కౌంటర్.. “మగతనం గురించి మాట్లాడే అర్హత నీకుందా?”
మాచర్ల రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. టిడిపి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా పల్నాడు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు.
ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 15 సంవత్సరాల పాటు నియోజకవర్గానికి దూరంగా పారిపోయిన వ్యక్తి ఇప్పుడు మగతనం గురించి మాట్లాడటం విచిత్రమని పిన్నెల్లి విమర్శించారు. ప్రజల ముందే నిజాలు చెప్పేందుకు సిద్ధమని, ఎవరి హయాంలో మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందిందనే అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
తమ పాలనలో రోడ్ల నిర్మాణం, కేంద్ర విశ్వవిద్యాలయం, జలజీవన్ మిషన్, ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల నుంచి 50 పడకలకు పెంపు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇవన్నీ తాము తీసుకొచ్చిన పనులేనని, ఇప్పుడు వాటిని తమవిగా చెప్పుకోవడం సరికాదన్నారు.
అంతేకాకుండా బెల్ట్ షాపులు, చిన్నారులకు అందించే కోడిగుడ్ల విక్రయం, పేదలకు పంచే రేషన్ బియ్యం మాఫియా, గతంలో మీ కుటుంబ హయాంలో జరిగిన హత్యలు, ప్రైవేట్ సైన్యం పేరుతో జరుగుతున్న అకృత్యాలపై కూడా చర్చకు సిద్ధమని అన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు, గంజాయి అమ్మకాలతో యువత చెడిపోతున్నారని మండిపడ్డారు.
పశర్లపాడు గ్రామంలో ఏ పార్టీకి సంబంధం లేని యువకులు మద్యం మత్తులో పరస్పరం ఘర్షణపడి సీసాలు విసురుకున్న ఘటనను వైసీపీపై మోపడం చిల్లర రాజకీయమని పిన్నెల్లి పేర్కొన్నారు. రెండు సార్లు ఓడిపోయిన తర్వాత ప్రజలు అవకాశం ఇచ్చారని, చేతనైతే నిధులు తీసుకువచ్చి అభివృద్ధిలో పోటీ పడాలని సూచించారు.
వరికిపూడిశెల ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత మీకు లేదని, అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టు సాధ్యం కాదని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్‌మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకొచ్చామని తెలిపారు.
అలాగే మాచర్ల నియోజకవర్గానికి సుమారు రూ.3 వేల కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. సమయం వచ్చినప్పుడు మీ అరాచకాలు, మీ ప్రైవేట్ సైన్యం అకృత్యాలన్నీ బయటపెడతానని హెచ్చరించారు. త్వరలోనే ఆట మొదలు పెడతానని నీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని నిజాలు మాట్లాడకపోతే నీ పార్టీ నాయకులకు కూడా నిన్ను నమ్మే పరిస్థితి ఉండదని ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని అభివృద్ధిలో పోటీ పడాలని హితువు పలికారు, వయసును గౌరవించి మాట్లాడుతున్నానని లేదంటే నీకంటే ఎక్కువగా మాట్లాడగలనని అది మా విధానం కాదని తెలిపారు
