
మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మీడియా సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై నాలుగు బీరు బాటిళ్లు విసిరితే భయపడే వ్యక్తిని కాదని, 45 సంవత్సరాలుగా ఎన్నో రాజకీయ పరిస్థితులు చూశానని, దేనికీ బెదరనని స్పష్టం చేశారు. నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ప్రజల కోసం అన్నింటికీ సిద్ధమయ్యానని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులపై తీవ్ర విమర్శలు చేసిన బ్రహ్మానందరెడ్డి, వారు మాచర్లను పట్టిపీడిస్తున్న పరాన్నజీవులని ఆరోపించారు. రామకృష్ణారెడ్డికి నిజమైన ధైర్యం ఉంటే మాచర్ల సెంటర్‌లో నిలబడి ప్రజల మధ్య చర్చకు రావాలని సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాచర్ల అభివృద్ధి కోసం, ప్రాంతంలో శాంతి భద్రతలు నెలకొనేలా పనిచేస్తున్నామని తెలిపారు. అయితే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఎటువంటి దాడులకు పాల్పడినా దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
పిన్నెల్లి సోదరులు సంపాదించిన ప్రతి రూపాయిలో ప్రజల రక్తం, చెమట ఉందని ఆరోపించిన ఆయన, పచ్చని పల్లెల్లో అలజడులు సృష్టించి నీచ రాజకీయాలకు పాల్పడాలని చూస్తున్నారని విమర్శించారు. సొంత గ్రామ ప్రజలకు నీళ్లు అమ్ముకున్న చరిత్ర వారిదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సరస్వతి భూముల కేసులో చేసిన రాజకీయాలు అందరికీ తెలుసని, వారి పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. తనపై జరిగిన దాడి వెనుక ఎవరున్నా చట్టం ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని జూలకంటి బ్రహ్మానందరెడ్డి హెచ్చరించారు.
