
మాచర్ల: వరికపూడి ప్రాజెక్టు నిర్మాణం కోసం మే 1 నుంచి 42 రోజుల పాటు దీక్ష చేపట్టనున్నట్లు జల సాధన సమితి ప్రధాన కార్యదర్శి పల్నాడు శ్రీను తెలిపారు. స్థానిక సిపిఐ కొమెర వీరాస్వామి భవన్‌లో ప్రాజెక్టు సాధన సమితి అధ్యక్షుడు బత్తుల వీరయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పల్నాడు శ్రీను మాట్లాడుతూ, వరికపూడి ప్రాజెక్టు పల్నాటి ప్రజలకు దశాబ్దాలుగా నెరవేరని కలగా మిగిలిపోయిందన్నారు. పాలకులు మారినా ప్రాజెక్టు పనులు మాత్రం ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు త్వరలో ప్రారంభిస్తామంటూ కాలం గడిపిన పాలకులు, ఇప్పుడు అనుమతులే రాలేదని చెప్పడం బాధాకరమన్నారు.
అనుమతులు పూర్తిగా లేకుండానే పనులు ఎలా ప్రారంభిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకుల ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
ప్రాజెక్టు పనులు ప్రారంభించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, అందులో భాగంగా మే 1 నుంచి జూన్ 12 వరకు 42 రోజుల పాటు గ్రీన్ కలర్ దుస్తులు ధరించి సమితి సభ్యులు, రైతులతో కలిసి దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. అప్పటికీ స్పందన లేకపోతే రిలే నిరాహార దీక్షకు వెనుకాడమని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సిపిఐ మాచర్ల ఏరియా టౌన్ సెక్రటరీ మిద్దెపోగు బాబురావు, ఎంసిపిఐ రాష్ట్ర నాయకులు అబ్రహం లింకన్, ఎంసిపిఐ (యు) జిల్లా నాయకులు మాచవరపు నాగేశ్వరరావు, జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి నాయకులు గురజాల అప్పారావు, రిటైర్డ్ ఎంఈఓ గాదె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
