
పల్నాడు జిల్లా, కారంపూడి మండలం:
పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసే దిశగా పోలీసులు చర్యలు మరింత కఠినతరం చేశారు. ఈ క్రమంలో కారంపూడి మండలం పేట సన్నిగండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని పోతురాజు గుట్ట ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ తనిఖీలలో గురజాల డీఎస్పీ ఎం. మహేశ్వరరావు ఆధ్వర్యంలో సీఐలు శరత్ బాబు, రాజేష్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.

సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాలు, వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేని 30 మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది. అలాగే 14 ఆయుధాలను (వెపన్స్) గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల ఈ చర్యతో పోతురాజు గుట్ట పరిసర ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలపై గట్టి చెక్ పడినట్లు భావిస్తున్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పెరుగుతున్న నేరాలను దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి కార్డన్ సెర్చ్‌లు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.
డీఎస్పీ మహేశ్వరరావు మాట్లాడుతూ, “ప్రజలు చట్టాలకు లోబడి ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నేరాలను అరికట్టేందుకు ప్రజల సహకారం అవసరం” అని సూచించారు.
పోలీసుల ఈ చర్యతో స్థానికుల్లో భద్రతాభావం పెరిగినప్పటికీ, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిలో ఆందోళన నెలకొంది.
