
పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామ శివారులో ఎం.ఎస్.ఆర్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరై భూమి పూజ చేసి, నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా పార్క్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందిస్తూ, ప్రాంతీయ అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
“ఎం.ఎస్.ఆర్ ఇండస్ట్రియల్ పార్క్ స్థాపనతో మాచర్ల ప్రాంతానికి పరిశ్రమల వాతావరణం ఏర్పడుతుంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ పార్క్ ద్వారా పెట్టుబడులు ఆకర్షితమవడంతో పాటు, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ తరహా ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతాయి. యాజమాన్యం అన్ని ప్రమాణాలను పాటిస్తూ, పర్యావరణానికి హాని కలగకుండా పరిశ్రమలను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్క్ యాజమాన్యం ప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
