
పల్నాడు జిల్లా దాచేపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకట్ నాయక్ మృతి చెందారు. నరసరావుపేట నుండి దాచేపల్లికి టు వీలర్‌పై వస్తుండగా, అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంటున్న లారీని ఆయన ప్రయాణిస్తున్న బైక్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వెంకట్ నాయక్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను దాచేపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో పిడుగురాళ్ల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే ఆయన మృతి చెందారు.
ప్రస్తుతం వెంకట్ నాయక్ వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో పోలీస్ విభాగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
