
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
వారికి ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామివారు ఊరేగింపుగా బయలుదేరగా, వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణలతో పాల్గొన్నారు. మాచర్ల పట్టణం అంతా భక్తి పారవశ్యంతో మార్మోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఈ వేడుకలకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అలాగే నియోజకవర్గ ప్రజలు భారీగా హాజరయ్యారు. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.
సుమారు 1880 సంవత్సరం నుంచి చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ రథోత్సవం ప్రతి ఏడాది ఘనంగా జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పోలీసులు సమర్థవంతంగా నిర్వహించారు.
