
పల్నాడు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రథోత్సవం సందర్భంగా పలనాటి బ్రహ్మనాయుడు కూరగాయల మార్కెట్ యూనియన్ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులకు ఈ అన్నదానం ఎంతో ఉపయుక్తంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని స్వయంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం కూరగాయల మార్కెట్ యూనియన్ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి తమ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చెన్నకేశవ స్వామి రథోత్సవానికి వచ్చే భక్తులకు యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భక్తులకు సేవ చేయాలనే తపనతో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన మంచి కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
