
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన కామనబోయిన చౌడమ్మ అనుమానాస్పద మృతి కేసు హత్యగా మారింది. మొదట ఉరివేసుకుని ఆత్మహత్యగా భావించిన ఈ ఘటన, పోస్టుమార్టం నివేదికతో అసలు నిజం బయటపడింది.
మాచర్ల పట్టణం 22వ వార్డుకు చెందిన చౌడమ్మ (23) మృతి కేసును మార్చి 18, 2026న Cr.No.27/2026 కింద BNSS సెక్షన్ 194 ప్రకారం నమోదు చేసిన పోలీసులు, ఏప్రిల్ 5న దాన్ని BNS సెక్షన్ 103(1) కింద హత్య కేసుగా మార్పు చేశారు.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించగా, విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలి తండ్రి కామనబోయిన చంద్రశ్రీను, అతని మేనల్లుడు పచ్చిపాల శ్రీను కలిసి చౌడమ్మను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రేమ వివాహమే ఈ దారుణానికి కారణమని తెలిసింది. కుటుంబ సభ్యులను ఎదిరించి జమ్మలమడక గ్రామానికి చెందిన నాగరాజును ప్రేమించి పెళ్లి చేసుకున్న చౌడమ్మను, పంచాయతీ పేరుతో మళ్లీ పెళ్లి చేస్తామని నమ్మించి ఇంటికి తీసుకెళ్లిన తండ్రి, ‘పరువు పోయింది’ అన్న భావనతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి, మేనల్లుడు కలిసి చౌడమ్మ గొంతు నులిమి హత్య చేసి, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యగా చూపించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన మాచర్ల పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. కేసులో నిందితులైన ఇద్దరికి మాచర్ల జడ్జి ప్రశాంత్ 14 రోజుల రిమాండ్ విధించగా, వారిని గురజాల సబ్ జైలుకు తరలించారు.
