
మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అత్యాచార ఘటనపై సిపిఐ మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకువచ్చినా, వాటి అమలు మాత్రం సక్రమంగా జరగడం లేదని విమర్శించారు. పట్టపగలే ఇళ్లలోకి చొరబడి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతుండటం చట్టవ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు.
ఈ ఘటనలో నిందితుడు అత్యంత పాశవికంగా ప్రవర్తించి కూడా ఎలాంటి భయంలేకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని ఆయన అన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు అక్రమాలకు పాల్పడితే ఎంత బలమైన చట్టాలున్నా ప్రయోజనం ఉండదని, మాచర్లలో జరుగుతున్న వరుస ఘటనలే దీనికి నిదర్శనమన్నారు.
చిన్నపాటి వివాదాలకే పోలీస్ స్టేషన్‌కు వెళ్లే సామాన్యులకు కూడా ముడుపులు లేకుండా న్యాయం జరగని పరిస్థితి నెలకొనడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అత్యాచారం జరిగిన ఘటనకు రోజులు గడుస్తున్నా నిందితుడిని గుర్తించడంలో పోలీసులు విఫలమవుతున్నారని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఎక్కడో ప్రశ్నించారు.
