
మాచర్ల పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దేవస్థానం కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్నాటి ప్రజల కొంగుబంగారంగా నిలిచిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం తిరుణాళ్లు ఎంతో విశిష్టమైనవని పేర్కొన్నారు. ఈ పవిత్ర సందర్భంలో స్వామివారిని దర్శించుకోవడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు. పల్నాడు ప్రాంత ప్రజలు సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో, ధనధాన్యాలతో సంతోషంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
