
స్వాతంత్య్ర ఉద్యమ నేత, ప్రముఖ సంఘసంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మాచర్ల పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని, బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానేత అని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.

ప్రస్తుత తరానికి ఆయన ఆలోచనలు మార్గదర్శకంగా నిలుస్తాయని, ముఖ్యంగా యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిన్నెల్లి పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని ఆయన గుర్తు చేశారు.
