
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెల్దుర్తి టీడీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
గత ఐదు సంవత్సరాల్లో తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని, కార్యాలయాలు, ఇళ్లు, వాహనాలు ధ్వంసం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు.
“తప్పుడు కేసులు మాది కాదు… మీ పాలనలోనే మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు… చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం…” అని స్పష్టం చేశారు.
అదేవిధంగా కండ్లకుంట – కొత్త పుల్లారెడ్డిగూడెం గ్రామాల మధ్య అక్రమంగా చెరువు ఏర్పాటు చేసి ప్రభుత్వ కరెంటుతో నీళ్లు అమ్ముకున్నారని ఆరోపించారు. భూకబ్జాలు, బినామీల వివరాలు త్వరలో బయటపెడతామని హెచ్చరించారు.
“మీ అక్రమాలన్నీ బయటపెడతాం… ప్రజలను మోసం చేసిన వారిని వదిలిపెట్టం…” అని ఎమ్మెల్యే తీవ్రంగా వ్యాఖ్యానించారు.
మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించిన ఆయన… అక్రమ చర్యలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.
వరిక పుడిసెల ప్రాజెక్ట్‌కు అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని, మెగా టెక్స్‌టైల్ పార్క్ కోసం భూ సర్వే కొనసాగుతోందని చెప్పారు. త్వరలోనే 132 కెవి సబ్‌స్టేషన్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు.
