
రోడ్డు ప్రమాదంలో కాబోయే వధూవరుల దుర్మరణం
దుర్గి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. త్వరలో వివాహ బంధంతో ఒక్కటవ్వాల్సిన యువ జంట రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
గుంటూరు పట్టణానికి చెందిన నేలపాటి సందీప్ (21), సోఫియా (20) కొంతకాలంగా ప్రేమించుకుంటూ ఉండగా, ఇరు కుటుంబాలు వారి వివాహానికి అంగీకరించాయి. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
గుడ్ ఫ్రైడే సందర్భంగా సందీప్ యేసుక్రీస్తు మాల వేసుకున్నాడు. మాల విరమించేందుకు సోఫియాతో కలిసి ద్విచక్ర వాహనంపై విజయపురి సౌత్‌లోని సాగర్‌మాత చర్చికి వెళ్లారు. అక్కడ ప్రార్థనలు చేసి, నూరేళ్లు కలిసిమెలిసి జీవించాలని దేవుని ప్రార్థించారు. అనంతరం సాగర్, ఎత్తిపోతల ప్రాంతాలను వీక్షించి గుంటూరుకు తిరుగు ప్రయాణం ప్రారంభించారు.
ఈ క్రమంలో దుర్గి మండలం ఓబులేశునిపల్లె గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను గుర్తించలేక ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
వీరితో పాటు గుంటూరు నుంచి వచ్చిన మరో ఇద్దరు స్నేహితులు వేరే ద్విచక్ర వాహనంపై వెనుకనే వస్తుండగా, ప్రమాద స్థలానికి కొద్దిదూరంలో ఉన్నట్లు ‘నాని’ అనే యువకుడు తెలిపాడు.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. దుర్గి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సందీప్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి తండ్రి లేరు. సోఫియాకు తల్లి లేరు. ఈ విషాద ఘటన రెండు కుటుంబాల్లోనూ తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది.
