
లోక్‌సభలో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందడం ఐదు కోట్ల ఆంధ్రుల విజయంగా భావిస్తున్నామని టీడీపీ నాయకుడు యాగంటి మల్లికార్జునరావు అన్నారు. అమరావతి ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు అని, ప్రజా రాజధానిగా చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.
అమరావతికి పూర్తి స్థాయిలో న్యాయం చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడని కొనియాడారు. ఈ బిల్లుతో ఇకపై అమరావతిని ఎవరూ మార్చలేరని, మూడు రాజధానుల అంశంపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇక రాజకీయాలు చేయలేరని విమర్శించారు.
రాష్ట్ర విభజన సమయంలో అమరావతికి మద్దతు తెలిపిన వైఎస్ జగన్, 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేశారని ఆరోపించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయిందని, ఏ ప్రాంతానికీ న్యాయం జరగలేదని అన్నారు.
అమరావతి నిర్మాణం కోసం రైతులు సుమారు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన ఘనత ప్రపంచంలో అరుదైనదని తెలిపారు. మూడు రాజధానుల ప్రకటనతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారని పేర్కొన్నారు. అమరావతి కోసం 1600 రోజులకు పైగా సాగిన రైతుల ఉద్యమం చరిత్రాత్మకమని, గిన్నిస్ బుక్‌లో కూడా నమోదు అయిందని అన్నారు.
అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు, ఉద్యమం చేసిన మహిళలకు అభినందనలు తెలిపారు. అమరావతిని ఏకైక రాజధానిగా నిర్ణయించడం ద్వారా ప్రజలు పెట్టుకున్న నమ్మకం నెరవేరిందని చెప్పారు.
ఒకే రాష్ట్రం–ఒకే రాజధాని నినాదంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన అసెంబ్లీ తీర్మానానికి చట్టబద్ధత కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
