
నేరాల నియంత్రణలో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు కారంపూడి మండలం మిర్యాల గ్రామంలో ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ సెర్చ్ సందర్భంగా సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను, కొన్ని మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో వివాదాలకు తావు లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించాలని సూచించారు. గ్రామాల్లో నేరాలను పూర్తిగా అరికట్టాలని, డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.
అలాగే గ్రామాల్లో ఏవైనా అనుమానాస్పద లేదా అసాంఘిక కార్యకలాపాలు గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ కార్డెన్ సెర్చ్ కార్యక్రమం కారంపూడి సర్కిల్ సీఐ శరత్, ఎస్సై వాసు పర్యవేక్షణలో 42 మంది సిబ్బందితో నిర్వహించినట్లు తెలిపారు.
