
రాష్ట్రంలోని వడ్డెర సామాజికవర్గ అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి కులవృత్తిని ప్రోత్సహిస్తూ, ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వ ఆధీనంలోని కొండ పోరంబోకు భూముల్లో వడ్డెర కో-ఆపరేటివ్ సొసైటీలకు మైనింగ్ లీజులు కేటాయించాలని ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషంగా మారింది.
పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలోని పలుచోట్ల వడ్డెర సామాజికవర్గానికి చెందిన ప్రజలు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. తమ సంప్రదాయ వృత్తి అయిన రాళ్లు కొట్టడం, మట్టి పనులు చేసుకునేందుకు ప్రభుత్వ భూముల్లో మైనింగ్ లీజులు కల్పిస్తే జీవనోపాధి మెరుగుపడుతుందని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన లోకేశ్, అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం, తాజా కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని మంత్రి లోకేశ్ ప్రతిపాదనగా తీసుకువచ్చారు. వడ్డెర వర్గాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుపర్చడంలో ఈ నిర్ణయం కీలకమని ఆయన వివరించారు. దీనిపై సమగ్రంగా చర్చించిన మంత్రివర్గం, వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజుల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, విధివిధానాలతో త్వరలోనే ప్రభుత్వం అధికారిక జీవో విడుదల చేయనుంది.
యువగళం పాదయాత్రలో ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకున్న లోకేశ్, ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తుండటం గమనార్హం. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది వడ్డెర కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
