
మాచర్ల (పల్నాడు జిల్లా): అంతర్జాతీయ స్థాయిలో యుద్ధం జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న ప్రచారం ప్రజల్లో ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో మాచర్ల పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు.

పెట్రోల్ కోసం వాహనాలతో పాటు బాటిళ్లు, క్యాన్లు తీసుకుని బంకుల వద్దకు చేరుకున్న ప్రజలు, అవసరానికి మించి నిల్వ చేసుకునేందుకు ఎగబడుతున్నారు. దీంతో బంకుల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది.
డీజిల్ కొరత వస్తుందన్న భయంతో ఆటో డ్రైవర్లు కూడా పెద్ద మొత్తంలో డీజిల్ నింపుకుంటున్నారు. కొందరు ఆటోలతో పాటు పెద్ద డ్రమ్ముల్లో డీజిల్ నిల్వ చేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.

అదే సమయంలో, కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోవడంతో తాత్కాలికంగా మూతపడిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో ప్రజల్లో మరింత ఆందోళన పెరిగింది.
అధికారులు మాత్రం ఇంధన కొరతపై అధికారిక సమాచారం లేదని, అవసరానికి మించి నిల్వలు చేసుకోవద్దని ప్రజలకు సూచిస్తున్నారు.
