
పల్నాడు జిల్లా, వినుకొండ: వేసవి పూర్తిగా ప్రారంభం కాకముందే పట్టణ శివారు కాలనీల్లో నీటి సమస్య తీవ్రంగా మారుతోంది. అధికారులు రోజు మార్చి రోజు కుళాయిల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు.
పైపులైన్లు లేని ప్రాంతాల్లో పురపాలక సంఘం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. అయితే జనాభా అధికంగా ఉండటంతో ఆ నీరు సరిపోవడం లేదు. ముఖ్యంగా మసీదు మాన్యం (అజాద్‌నగర్) ప్రాంతంలో సుమారు 2 వేలకుపైగా పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ పైపులైన్ సదుపాయం లేకపోవడంతో పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు.

కాలనీ వాసుల ఆవేదన ప్రకారం, ఒకసారి ట్యాంకర్ నీరు అందుకున్న తర్వాత మళ్లీ రావడానికి సుమారు 15 రోజుల సమయం పడుతోంది. దీంతో గత్యంతరం లేక ప్రైవేట్ ట్యాంకర్ల వద్ద ఒక్క డ్రమ్ నీటిని రూ. 50 చెల్లించి కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు.
కూలి పనులు చేసి జీవనం సాగిస్తున్న తమకు ఈ అదనపు భారం భరించలేకపోతున్నామని, ప్రభుత్వం మరియు అధికారులు తక్షణ చర్యలు తీసుకుని సరిపడా నీటి సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జీవి. ఆంజనేయులు స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
