
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం: వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డిగూడెం గ్రామంలో పోలీసుల విస్తృత కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పి బి. కృష్ణారావు ఆదేశాల మేరకు, గురజాల డిఎస్పి వెంకట రమణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.
సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా గ్రామంలో అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 31 బైకులు, 9 గొడ్డళ్లు, 7 కత్తులు, 7 గడ్డపలుగులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 2 లీటర్ల నాటుసారా, మద్యం సంబంధించిన ఒక కేసును నమోదు చేసి సీజ్ చేశారు.
ఈ సందర్భంగా డిఎస్పి వెంకట రమణ మాట్లాడుతూ, పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఇలాంటి కార్డెన్ సెర్చ్‌లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గ్రామస్తులు పోలీసులకు సహకరించి, అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
