
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మాచర్ల నియోజకవర్గ స్థాయిలో ‘రణభేరి 3.0’ కార్యక్రమం భాగంగా ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని యూటీఎఫ్ సీనియర్ నాయకుడు గాదె కిరీటి రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యూటీఎఫ్ సహాధ్యక్షులు జె. వాల్యానాయక్, జిల్లా కార్యదర్శి ఎ. నాసర రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు షేక్ అయేషా సుల్తానా, మండల సహాధ్యక్షుడు వి. బాలాజీ నాయక్, రాష్ట్ర కౌన్సిలర్ వై. మెహర్ బాబా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీని నియమించాలని, ఎన్నికల హామీల ప్రకారం 29% ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిల చెల్లింపుకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ విడుదల చేయాలని కోరారు. పాత పెన్షన్ విధానం అమలు, హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లుల సమస్యల పరిష్కారం వంటి పలు డిమాండ్లు వినిపించారు.
రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యూటీ, ఎర్న్డ్ లీవ్ ఎన్క్యాష్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని, కోవిడ్ కాలంలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని, పేరుకుపోయిన ఆర్థిక బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
దీక్ష అనంతరం సీనియర్ నాయకుడు షేక్ అలీ ముస్తాఫా నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం ఉపాధ్యాయులు ర్యాలీగా వెళ్లి మాచర్ల మండల తహసీల్దార్ కిరణ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల అభ్యర్థనలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి చేరుస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి సుమారు 150 మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సీనియర్ నాయకుడు పోలా మల్లికార్జున రావు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు
