
మాచర్ల పట్టణంలోని పురపాలక శాఖ కార్యాలయంలో సచివాలయ సెక్రటరీలు, సిబ్బందితో స్పెషల్ ఆఫీసర్, గురజాల ఆర్డీవో మురళీకృష్ణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణానికి మొత్తం రూ. 9.92 కోట్ల పన్ను డిమాండ్ ఉండగా, ఇప్పటివరకు రూ. 4.32 కోట్లు మాత్రమే వసూలయ్యాయని వెల్లడించారు. ఇంకా రూ. 5.59 కోట్లు వసూలు కావాల్సి ఉందని, ఇది కేవలం 44 శాతం మాత్రమే సాధించబడిందని పేర్కొన్నారు.
మార్చి 31 లోపు బకాయిలు చెల్లించే వారికి వడ్డీపై రాయితీలు లభిస్తాయని ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సిబ్బందికి సూచించారు. ప్రతి ఇంటికీ వెళ్లి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని, లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.
పట్టణ అభివృద్ధిలో సిబ్బంది కీలక పాత్ర పోషించాలని, టాక్స్ కలెక్షన్‌తో పాటు పారిశుధ్యం, మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అలాగే పట్టణంలోని స్మశాన వాటికల్లో కనీస సౌకర్యాల పరిస్థితిని సమీక్షించి, కాంపౌండ్ వాల్, మంచినీరు, విద్యుత్ వంటి అవసరాలపై నివేదిక సమర్పించాలని సూచించారు.
సచివాలయాల్లో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ, పన్ను వసూళ్లను 100 శాతం పూర్తి చేయాలని సిబ్బందికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
