
పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తనపై అక్రమంగా కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఈ క్లిష్ట సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ కుటుంబానికి అండగా నిలిచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పల్నాడు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు తనకు మనోధైర్యాన్ని అందిస్తూ ప్రతి దశలో అండగా ఉన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
“ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, మేమంతా ఒకరికి ఒకరం అండగా ఉంటాం” అని స్పష్టం చేశారు. అక్రమ కేసులతో పార్టీ నేతలను, కార్యకర్తలను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే సమయంలో గట్టి హెచ్చరిక చేస్తూ, “ఎవరు అక్రమ కేసులు పెట్టి మనోక్షోభకు గురి చేశారో, వారందరిపై అలాగే వారికి సహకరించిన అధికారులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
