
పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు మాచర్ల పట్టణంలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మాచర్ల పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.135 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచినట్లు తెలిపారు. రానున్న సంవత్సరం కాలంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రూ.40 కోట్లతో మాచర్ల-రెంటచింతల పట్టణాలకు బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
మున్సిపల్ క్వారీ పరిసర ప్రాంతాలు, మార్కెట్ యార్డ్ సమీపంలో షాపులు నిర్మించి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. గతంలో టెడ్కో ఇళ్ల కోసం పేర్లు నమోదు చేసుకున్న వారు మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి తమ వివరాలు తెలుసుకోవాలని కోరారు.
గత 20 సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్న ఆయన, ఎమ్మెల్యేగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు న్యాయం చేసే విషయంలో ఎలాంటి రాజకీయ భేదాలు చూడనని, ఎవరైనా అన్యాయం చేస్తే క్షమించబోమని స్పష్టం చేశారు.

తమ హయాంలో మూడుసార్లు ముస్లింలకు మున్సిపల్ చైర్మన్ పదవి కల్పించిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన, మసీదు నిర్మాణం, షాదీ ఖానా ఏర్పాటులో తమ కుటుంబం ఎప్పుడూ అండగా నిలిచిందని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని, కులమత భేదాలకు అతీతంగా మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు.
మీ అందరి సహకారంతో రాబోయే మూడు సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పేర్కొన్నారు.
