
పల్నాడు జిల్లా, మాచర్ల:
ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ ప్రభావంతో వంట గ్యాస్ సరఫరాలో ఏర్పడిన సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సీపీఐ మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
గురువారం విలేకరులతో మాట్లాడుతూ, మాచర్లతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్యాస్ సకాలంలో అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మాచర్లలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఫాతిమా గ్యాస్ డీలర్ సహా కొంతమంది హోటళ్లకు బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రజలకు అందాల్సిన సిలిండర్లను మళ్లించడం బాధాకరమని, హోటల్ యజమానులు అధిక ధరలకు సిలిండర్లు కొనుగోలు చేస్తున్నామని చెప్పి తినుబండారాల ధరలను పెంచుతున్నారని విమర్శించారు. నియంత్రణలో ఉండాల్సిన అధికారులు స్పందించకపోవడంతో గ్యాస్ డీలర్లు, హోటల్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్ గడువును ప్రస్తుతం ఉన్న 45 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించాలని, అలాగే డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్ చేసి హోటళ్లకు విక్రయిస్తున్న ఫాతిమా గ్యాస్ డీలర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు
