
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుండి విడుదలైన సందర్భంగా పిడుగురాళ్లలో ఆయనకు ఘనస్వాగతం లభించింది.
గత 98 రోజులుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉండి బెయిల్‌పై విడుదలైన పిన్నెల్లి, మాచర్లకు వెళ్తూ మార్గమధ్యంలో పిడుగురాళ్ల చేరుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ గుడి వద్ద పార్టీ శ్రేణులు ఆయనకు నీరాజనాలు పలికాయి.
అలాగే పల్నాడు హాస్పిటల్ వద్ద అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ పిన్నెల్లికి ఘనస్వాగతం పలికారు. పిన్నెల్లిని చూడగానే “అన్నా బాగున్నావా” అంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం అక్కడి వాతావరణాన్ని మరింత భావోద్వేగంగా మార్చింది.
అనంతరం పూలమాలతో, శాలువాతో ఆయనను సత్కరించారు. పిన్నెల్లి రాకతో పిడుగురాళ్ల ప్రాంతం కోలాహలంగా మారింది.
గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పిన్నెల్లితో పాటు వచ్చిన అనుచరుల కోసం డాక్టర్ అశోక్ కుమార్ ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్మూర్ వెంకట్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని పిన్నెల్లికి తమ సంఘీభావాన్ని తెలిపారు.
