
పల్నాడు:
నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుండి 98 రోజుల అనంతరం విడుదలైన పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తనపై నమోదైన కేసులను తీవ్రంగా ఖండిస్తూ భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు.
“అన్యాయంగా, అక్రమ కేసులో మమ్మల్ని 98 రోజులపాటు జైలులో పెట్టారు. ఈరోజుతో 99 రోజులు పూర్తయ్యాయి. ఇది న్యాయానికి విరుద్ధమైన చర్య” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జైలు జీవితం తనకు మరియు తన కుటుంబానికి మానసికంగా ఎంత కష్టంగా గడిచిందో తెలియజేస్తూ, “మాకు ఇబ్బంది పెట్టిన దాని కన్నా మీరు ఎక్కువ మానసిక శోభ అనుభవిస్తారు” అంటూ ఘాటుగా స్పందించారు. తనపై జరిగిన అన్యాయానికి తగిన సమాధానం సమయం వచ్చినప్పుడు ఇస్తామని హెచ్చరించారు.
“కచ్చితంగా మాకంటూ ఒకరోజు వస్తుంది… వచ్చిన రోజు మేమంటే ఏంటో చూపిస్తాం” అంటూ పిన్నెల్లి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
98 రోజుల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చిన నాయకుడి ఆవేదన, ఆగ్రహం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించాయి. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
