
పల్నాడు జిల్లా | మాచర్ల నియోజకవర్గం:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే “దివ్యాంగ శక్తి” పథకాన్ని మాచర్ల ఆర్టీసీ బస్టాండ్‌లో మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్‌ను రూ.2000 నుంచి రూ.3000కు పెంచేందుకు ఐదేళ్లు పట్టిందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులు, దివ్యాంగులకు అధిక మొత్తంలో పెన్షన్ అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని అన్నారు.
రాష్ట్రం అప్పుల భారంలో ఉన్నప్పటికీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, అయితే కొందరు రాజకీయ కారణాలతో కోర్టు కేసుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
దివ్యాంగుల ఆర్థిక, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, “దివ్యాంగ శక్తి” పథకం ద్వారా వారికి ప్రయాణంలో పెద్ద ఊరట లభిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
పథకం ప్రారంభం అనంతరం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారితో మమేకమయ్యారు. అదేవిధంగా దివ్యాంగులకు దగ్గరుండి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి వారి ఆకలి తీర్చడం విశేషంగా నిలిచింది.
