
పల్నాడు జిల్లా, రెంటచింతల మండలం:
రెంటచింతల మండలం గోలి గ్రామ సమీపంలోని గోలి వాగు బ్రిడ్జిపై రాత్రి వేళ మొసలి సంచరిస్తుండటం స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు కారణమైంది. వాగు దాటే ప్రజలు, ముఖ్యంగా రాత్రి సమయంలో వెళ్లే వారు ఆందోళన చెందుతున్నారు.
విషయం తెలుసుకున్న తహశీల్దార్ మేరి కనకం వెంటనే స్పందించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అదేవిధంగా, వాగు పరిసర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు.
ఈ సందర్భంగా స్థానిక పోలీసు అధికారి ఎస్సై మన్మోహన్ ప్రసాద్ ప్రజలను అప్రమత్తం చేశారు. వాగు వద్దకు వెళ్లే మహిళలు, విద్యార్థులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని, రాత్రివేళల్లో ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు.
మొసలి సంచారం నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
