
సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంగా మారిందని టీడీపీ సీనియర్ నేత యాగంటి మల్లిఖార్జునరావు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తోందని అన్నారు.
రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రభుత్వ పరిపాలనా దక్షత స్పష్టంగా కనిపిస్తోందని, ఈ పెట్టుబడుల ద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులు ఈ నెలలో ప్రారంభించి 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పుట్టపర్తిలో రూ.15 వేల కోట్లతో యుద్ధ విమానాల తయారీ కేంద్రం, డ్రోన్ సిటీ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త దిశను నిర్దేశిస్తున్నాయని చెప్పారు.
క్యారియర్ సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో ఏపీలో యూనిట్ ఏర్పాటు చేసి 3 వేల మందికి ఉపాధి కల్పించనుందని, శ్రీ సిటీ ఇప్పటికే గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఎదిగి వేలాదిమందికి ఉద్యోగాలు ఇస్తోందని పేర్కొన్నారు. అలాగే తిరుపతి జిల్లా సత్యవేడులో రూ.2508 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి మైలురాళ్లని అన్నారు.
విశాఖ కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ విడుదల కావడం సీఎం చంద్రబాబు పట్టుదలకు నిదర్శనమని, దీనివల్ల స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని తెలిపారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
మాచర్ల నియోజకవర్గంలో ఎంపీ లావు కృష్ణదేవరాయులు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కృషితో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని కొనియాడారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, ప్రజలు వాటిని గమనించాలని యాగంటి కోరారు.
23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
