
పల్నాడు జిల్లా దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి సమీపంలోని నెహ్రూ నగర్ తండాలో ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న తండావాసులకు శాశ్వత పరిష్కారం లభించింది. జనజీవనానికి దూరంగా, రాకపోకల సౌకర్యాలు కూడా సరిగా లేని ఈ తండాలో ప్రజలు చెరువులు, వాగుల నీటినే తాగుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఈ సమస్యను గుర్తించిన రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల ప్రతినిధులు రోటరీ జిల్లా 3150 గవర్నర్ ఎస్వీ రాంప్రసాద్, అవార్డు కమిటీ చైర్మన్ డాక్టర్ పంగులూరి విష్ణుబాబులకు వివరించారు. వారి సహకారంతో బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పి. బాలకోటి రెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ అధ్యక్షులు పంగులూరి మురళి ఆధ్వర్యంలో సుమారు రూ.2 లక్షల విలువైన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను అందించారు.
అదే సమయంలో మాచర్లకు చెందిన రంగమ్మ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ భూక్య శ్రీ సౌమ్యబాయి, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మూడవత్ దశరథ్ చౌహన్ తమ తల్లిదండ్రులు మూఢవత్ తావూర్య నాయక్, రంగమ్మ బాయి పేరుతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రత్యేక షెడ్ నిర్మాణానికి రూ.2 లక్షలకు పైగా ఆర్థిక సహాయం అందించారు.
నూతనంగా నిర్మించిన షెడ్‌లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను రోటరీ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ ఎస్వీ రాంప్రసాద్, బాలకోటి రెడ్డి, పంగులూరి మురళి, మాచర్ల రోటరీ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ కొండవీటి రామకోటయ్య, అధ్యక్షులు తుమ్మల సత్యప్రసాద్, కార్యదర్శి ఆలేటి కోటేశ్వరరావు, ప్రోగ్రాం కన్వీనర్ పఠాన్ నాగూర్ వలి తదితరులు తండావాసుల సమక్షంలో ప్రారంభించారు.
కార్యక్రమానికి ముందు మహిళలు సంప్రదాయ దుస్తుల్లో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో నెహ్రూ తండా ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు మంత్రు నాయక్, సక్రు నాయక్, ఎస్‌వీఎన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ డైరెక్టర్ బ్రహ్మ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నో తరాలుగా ఎదురుచూస్తున్న తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిన రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల సేవలను తండావాసులు, యూనియన్ నాయకులు అభినందించారు. అలాగే షెడ్ నిర్మాణానికి సహకరించిన డాక్టర్ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
