
మాచర్లలో ట్రాఫిక్ సమస్యలపై పోలీసుల దృష్టి… సహకారం లేకపోతే చర్యలు తప్పవు
మాచర్ల పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల అర్బన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ నజీర్ బేగ్, పట్టణ ఎస్సై కత్తి స్వర్ణలతతో కలిసి ట్రాఫిక్ పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఐ మహమ్మద్ నజీర్ బేగ్ మాట్లాడుతూ, మాచర్ల పట్టణానికి పరిసర గ్రామాల నుంచి భారీగా ప్రజలు రాకపోకలు సాగించడం వల్ల ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. దీనికి తోడు పట్టణంలో కొనసాగుతున్న హైవే పనులు కూడా ట్రాఫిక్ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తున్నాయని పేర్కొన్నారు
ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా అధిగమించేందుకు వ్యాపారులు, వాహనదారులు, సాధారణ ప్రజలు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రోడ్లపై అక్రమ పార్కింగ్, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వంటి చర్యలు సమస్యలకు కారణమవుతున్నాయని తెలిపారు.
అదే సమయంలో, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమని సీఐ స్పష్టం చేశారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రజల సహకారంతో సమస్యలను తగ్గించగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
మాచర్లలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీసుల చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
