ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్‌తో మంటలు
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
పట్టణంలోని 133 కేవీ సబ్ స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.
మంటలు ఎగిసిపడటంతో స్థానికంగా ఆందోళన వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమై అత్యవసర చర్యలు చేపట్టారు.
ప్రారంభంలో మంటలు అదుపులోకి రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫోమ్ వాటర్‌తో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఫైర్ ఇంజన్ సకాలంలో చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
ఘటనపై విద్యుత్ శాఖ ఎస్సీ పూర్ణచంద్రరావు హుటాహుటిన సబ్ స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఈ ఘటనపై డీఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ…
132 కేవీ మాచర్ల–రెంటచింతల సర్కిట్-1 కరెంట్ ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ కావడంతో మంటలు వ్యాపించాయని తెలిపారు.
సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారని చెప్పారు.
ఇది సాధారణ సాంకేతిక లోపం కారణంగా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.
ఈ అగ్నిప్రమాదంలో సుమారు 20 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
ఒంగోలు నుంచి అవసరమైన మిషనరీ తెప్పించామని, ఈరోజు సాయంత్రం లోగా పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని డీఈ స్పష్టం చేశారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు.


